శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
శ్రీ వారాహి దేవి అమ్మవారి నవరాత్రులు ( 15-07-2026 TO 24-07-2026 )
-: శ్రీ వారాహి దేవి విశిష్టత :-
శ్రీ వారాహి దేవి హిందూ శాస్త్ర సాంప్రదాయంలో సప్తమాతృకలలో ఐదవ అవతారం. దుర్గాదేవి (చండిక) రక్తబీజుడనే భయంకరమైన రాక్షసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు, ఆమెకు సహాయం చేయడానికి ముక్కోటి దేవతల శక్తులు స్త్రీరూపాలు దాల్చాయి. ఆ సమయంలో విష్ణుమూర్తి అంతరంగం నుండి వరాహముఖంతో, చేతిలో హలము (నాగలి), ముసలము (రోకలి) ధరించి శ్రీ వారాహి దేవి ఆవిర్భవించింది. రక్తబీజుని శరీరం నుండి కిందపడే ప్రతి రక్తపు బొట్టు నుండి మరో రాక్షసుడు పుట్టకుండా, ఆ రక్తాన్ని నేలపై పడకముందే గ్రహించి రాక్షస సంహారంలో ఈమె కీలక పాత్ర పోషించింది. అనంతరం భండాసురుడు అనే రాక్షసుడితో శ్రీ లలితా త్రిపురసుందరి దేవి యుద్ధం చేసినప్పుడు, శ్రీ వారాహి దేవి ఆమె సైన్యానికి "దండనాథ" (సర్వసేనాధిపతి) గా వ్యవహరించింది. సింహవాహనమైన శ్రీ లలితాదేవికి ఈమె కిరిచక్ర రథంపై అధిష్ఠానమై సైన్యాన్ని నడిపించింది. శ్రీ వారాహి దేవి అనుగ్రహంతో శత్రుబాధలు తొలగి, కోర్టు మరియు భూమి వివాదాలు పరిష్కారమవుతాయి. దృష్టిదోషం, నరఘోష వంటి నకారాత్మక శక్తులు తొలగి, ఐశ్వర్యం, విజయాలు, కార్యసిద్ధి మరియు సర్వాభీష్ట ఫలితాలు లభిస్తాయి.
కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలోని "ఓం శివశక్తి పీఠం – శంబాల నగరం” దేవాలయ ప్రాంగణంలో, 108 దేవతామూర్తుల సప్తమాత్రికులతో కూడిన శ్రీ వారాహి దేవి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా, 15-07-2026 (బుధవారం) నుండి 24-07-2026 (శుక్రవారం) వరకు ప్రతిరోజూ ఉదయం 8:00 గంటలకు పంచామృతాభిషేకం, అలంకరణ, అష్టోత్తర శతనామార్చన, వారాహి హోమం, కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడును.
కావున సమస్త భక్తులు విచ్చేసి శ్రీ వారాహి దేవి అమ్మవారిని దర్శించుకొని, శ్రీ ఉమా మహేశ్వర నిత్యాన్నదానమునందు అన్నప్రసాదాన్ని స్వీకరించి తరించివలసిందిగా కోరుచున్నాము.