శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
36 అడుగుల శ్రీ కాలభైరవ స్వామి
36 అడుగుల శ్రీ కాలభైరవ స్వామి :
"ఓం శివ శక్తి పీఠం - శంబల నగరం" నందు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారితో పాటు అంతే గంభీరంగా, అద్భుతంగా ప్రతిష్టించిన 36 అడుగుల శ్రీ కాలభైరవ స్వామి వారి విగ్రహం భక్తుల పాలిట అఖండ రక్షణ కవచం.
36 అడుగుల శ్రీ కాలభైరవ స్వామి క్షేత్రం – భయవినాశకర రక్షక స్వరూపం :-
"ఓం శివ శక్తి పీఠం - శంబల నగరం" విశేష ఆధ్యాత్మిక శక్తులకు నిలయంగా మారుతోంది. ఇక్కడ ఒకవైపు సృష్టి తత్త్వానికి ప్రతీకగా 36 అడుగుల సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉండగా, అదే క్షేత్రంలో కాలానికి అధిపతి, సకల సృష్టిని రక్షించే విశ్వేశ్వరుని ఉగ్రరూపమైన 36 అడుగుల శ్రీ కాలభైరవ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించడం అత్యంత మహిమాన్వితమైన విషయం. నింగికెగసినట్టున్న నల్లని దివ్య మంగళ స్వరూపంతో, చేతిలో త్రిశూలాన్ని ధరించి, శ్వాన (కుక్క) వాహన సమేతుడై దర్శనమిచ్చే కాలభైరవుడు, శంబల నగరానికి అభయప్రదాతగా, క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతున్నాడు.
ఆవిర్భావం :-
పురాణాల ప్రకారం, ఒకసారి బ్రహ్మదేవునికి, శ్రీమహావిష్ణువుకు మధ్య "ఎవరు గొప్ప?" అనే విషయంలో వివాదం తలెత్తింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు తన ఐదవ ముఖంతో పరమశివుడిని తక్కువ చేసి మాట్లాడాడు. అప్పుడు పరమశివుని అపరిమితమైన క్రోధం (కోపం) నుండి, ప్రళయ కాల రుద్రుని వలె భయంకరమైన తేజస్సుతో ఈ "కాలభైరవుడు" ఆవిర్భవించాడు. శివుని ఆజ్ఞతో కాలభైరవుడు తన చేతి గోటితో శివుడిని దూషించిన బ్రహ్మదేవుని ఐదవ శిరస్సును ఖండించాడు. అందువల్లనే కాలభైరవుడిని శివుని పూర్ణ స్వరూపంగా, కాలానికి కూడా లయకారకుడిగా శాస్త్రాలు కీర్తిస్తున్నాయి. అనంతరం బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందేందుకు కాశీ క్షేత్రానికి చేరుకుని, అక్కడే శాశ్వతంగా నిలిచి ఆ నగరానికి "క్షేత్రపాలకుడు" అయ్యాడు.
క్షేత్ర విశిష్టత :-
కాలభైరవ స్వామి విగ్రహం 36 అడుగుల ఎత్తులో నిర్మితమైంది. ఇది శైవ తత్త్వంలోని 36 సృష్టి తత్త్వాలను తానే శాసిస్తున్నాడనే పరమార్థాన్ని సూచిస్తుంది. ఒకే పీఠంలో ఇద్దరు శక్తివంతమైన దైవాలు 36 అడుగుల ఎత్తులో కొలువై ఉండటం భారత దేశంలోనే అత్యంత అరుదైన విషయం. ఓం శివ శక్తి పీఠంలో వెలిసిన ఈ 36 అడుగుల కాలభైరవుడు ఈ క్షేత్రానికే కాకుండా, ఈ నగరానికి, ఇక్కడి భక్తులకు సర్వవేళలా అఖండ రక్షణ కల్పించే క్షేత్రపాలకుడిగా నిలిచాడు. స్వామివారి ముఖంలోని తీవ్రత దుష్టులకు భయాన్ని, సజ్జనులకు (భక్తులకు) కొండంత అభయాన్ని ఇస్తుంది. స్వామివారి వెనుక ఉండే నల్లని కుక్క వాహనం కూడా అంతే జీవకళతో చెక్కబడింది.
శ్లోకం :-
దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం | వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ ||
నారదాదియోగిబృందవందితం దిగంబరం | కాశికాపురాధినాథకాలభైరవం భజే ||
భావం :-
దేవేంద్రుని చేత పూజించబడే పవిత్రమైన పాదపద్మములు కలవాడా, సర్పమునే (పామునే) యజ్ఞోపవీతంగా (జంధ్యంగా) ధరించినవాడా, శిరస్సుపై చంద్రకళను కలిగి ఉండి భక్తులపై అపారమైన కృపను కురిపించేవాడా, నారదుడు మొదలైన మునిగణాలచే స్తుతించబడేవాడా, దిక్కులనే వస్త్రాలుగా ధరించిన ఓ కాశీ నగర నాథుడైన (శంబల నగర రక్షకుడైన) కాలభైరవా! నీకు నా భక్తిపూర్వక ప్రణామాలు.
పూజా ఫలితం :-
జాతకంలో రాహు-కేతువుల వల్ల కలిగే కాలసర్ప దోషాలు, శని మహాదశ లేదా ఏల్నాటి శని ప్రభావంతో బాధపడేవారు కాలభైరవుడిని పూజిస్తే ఆయా గ్రహాల పీడలు శీఘ్రంగా తొలగిపోతాయి. చేతబడి, నరగోడడు, దిష్టి దోషాలు మరియు ఇంటిపై ఉండే చెడు శక్తుల ప్రతాపాలు కాలభైరవుని చూపు పడగానే కాలి బూడిదవుతాయి. కాలానికి అధిపతి కావడం వల్ల అకాల మృత్యు భయాలు, ప్రమాదాల భయం తొలగిపోయి పూర్ణ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. మనసులోని ఆందోళన, డిప్రెషన్ నశిస్తాయి. వ్యాపారంలో, ఉద్యోగంలో లేదా కోర్టు కేసులలో ఇబ్బంది పెట్టే శత్రువుల కుతంత్రాలు స్వామివారి అనుగ్రహంతో పటాపంచలు అవుతాయి.