శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
భ్రమరాంబికా
శ్రీ భ్రమరాంబికా అమ్మవారి ఆలయం (ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం)ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో ఆరవ శక్తిపీఠం. మల్లికార్జున జ్యోతిర్లింగంతో కలిసి ఒకే ప్రాంగణంలో కొలువై ఉన్న ఈ క్షేత్రం, భారతదేశంలో జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కలసి ఉన్న అత్యంత అరుదైన మరియు పవిత్రమైన పుణ్యక్షేత్రం.
దక్షయజ్ఞం తర్వాత సతీదేవి పవిత్ర శరీరాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు, అమ్మవారి "మెడ భాగం" లేదా గ్రీవ భాగం పడిన పవిత్ర స్థలమిది. పురాణాల ప్రకారం, పూర్వం 'అరుణాసురుడు' అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి కఠోర తపస్సు చేసి.. ద్విపాదాల (మనుషులు, పక్షులు) వల్ల గానీ, చతుష్పాదాల (జంతువులు) వల్ల గానీ తనకు మరణం లేకుండా వరం పొందాడు. ఈ అహంకారంతో అతడు దేవతలను వేధించసాగాడు. వరం ప్రకారం అతడిని చంపడానికి ఏ మనిషికి, జంతువుకు సాధ్యం కాదు. అప్పుడు దేవతల ప్రార్థన మేరకు పరాశక్తి కోట్లాది "భ్రమరములు" (నల్లని తుమ్మెదలు - ఆరు పాదాలు కలవి) రూపం దాల్చింది. ఆ తుమ్మెదల సైన్యంతో అరుణాసురుడిని ముప్పుతిప్పలు పెట్టి సంహరించింది. అందువల్లనే అమ్మవారికి 'భ్రమరాంబిక' (తుమ్మెదల రూపంలో ఉన్న తల్లి) అని పేరు వచ్చింది. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..
శ్లోకం : -
"అలంపురే జోగులాంబా, శ్రీశైలే మల్లికార్జునీ |
కోల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా ||"
భావం : -
శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి సమేతురాలై, 'శ్రీ భ్రమరాంబికా దేవి' గా వెలిసిన ఆ జగన్మాతకు నా నమస్కారములు.
పూజా ఫలితం : -
"దర్శనాదేవ శ్రీశైలే పునర్జన్మ న విద్యతే" - ఈ క్షేత్రంలో మల్లికార్జున స్వామిని, భ్రమరాంబికా అమ్మవారిని కనులారా దర్శిస్తే చాలు, మళ్లీ పుట్టాల్సిన అవసరం లేని పరమపదవి (మోక్షం) లభిస్తుంది. తుమ్మెద రూపంలో రాక్షసుడిని అంతమొందించిన తల్లి కాబట్టి, ఈమెను పూజించడం వల్ల ఇంట్లోని దరిద్రం, దిష్టి దోషాలు, శత్రు భయాలు మటుమాయమవుతాయి. ముఖ్యంగా నవరాత్రులలో లేదా శ్రావణ మాసంలో అమ్మవారికి జరిపించే కుంకుమార్చన పూజల వల్ల దీర్ఘసుమంగళి ప్రాప్తి, గృహంలో సుఖసంతోషాలు కలుగుతాయి