శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం
ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం
ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో ఎల్లోరా గుహల చెంత కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఆఖరిదైన పన్నెండవ జ్యోతిర్లింగం. ఈ స్వామిని గృష్ణేశ్వరుడు, ఘుశ్మేశ్వరుడు లేదా కుసుమేశ్వరుడు అని కూడా పిలుస్తారు.
పురాణాల ప్రకారం, పూర్వం 'సుధర్ముడు''సుదేహ'అనే బ్రాహ్మణ దంపతులు నివసించేవారు. వారికి సంతానం కలగకపోవడంతో, సుదేహ తన చెల్లె లైన 'ఘుశ్మ'ను తన భర్తకు ఇచ్చి వివాహం జరిపించింది.ఘుశ్మ పరమ శివభక్తురాలు కావడంతో ప్రతిరోజూ 101 పార్థివ లింగాలను తయారు చేసి, పూజించిచెరువులో నిమజ్జనం చేసేది. శివుని అనుగ్రహంతో ఘుశ్మకు ఒక చక్కని మగసంతానం కలిగింది. కొంతకాలానికి సుదేహ మనసులో చెల్లెలిపై అసూయ, ద్వేషం పెరిగి ఘుశ్మ కుమారుడిని చంపి ఆ దేహాన్ని ఘుశ్మ ప్రతిరోజూ లింగాలను నిమజ్జనం చేసే చెరువులోనే పడేసింది.మరుసటి రోజు ఉదయం కొడుకు చనిపోయాడని తెలిసి ఇల్లంతా ఏడుస్తుంటే, ఘుశ్మ మాత్రం చలించకుండా శివునిపై భారమేసి, ఎప్పటిలాగే తన పూజ ముగించుకుని, లింగాల నిమజ్జనం కోసం చెరువులో నిమజ్జనం చేసి వెనుతిరుగుతుండగా, ఆశ్చర్యకరంగా ఆమె కుమారుడు ప్రాణాలతో నడుచుకుంటూ ఎదురొచ్చాడు. అదే సమయంలో పరమశివుడు జ్యోతిస్వరూపంతో అక్కడ ప్రత్యక్షమై సుదేహను సంహరించబోగా, ఘుశ్మ తన అక్కను క్షమించమని వేడుకోగా ఆమె భక్తికి, క్షమాగుణానికి మెచ్చిన పరమశివుడు..."నీ పేరు శాశ్వతంగా నిలిచేలా నేను ఇక్కడే ఘుశ్మేశ్వరుడిగా వెలుస్తున్నాను" అని చెప్పి జ్యోతిర్లింగ రూపంలో అక్కడ స్థిరపడిపోయాడు. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..
శ్లోకం :-
ఇలాపురే రమ్యవిశాలకేస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యమ్ |
వందే మహోదారతరస్వభావం ఘుశ్మేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ||
భావం :-
ఇలాపుర (ఎల్లోరా) అనే అత్యంత సుందరమైన, విశాలమైన క్షేత్రంలో వెలిసి, జగత్తుకే శ్రేష్ఠుడై, మరియు భక్తుల పట్ల అపారమైన దయ, ఉదార స్వభావం కలిగినవాడు అయిన ఆ 'శ్రీ ఘుశ్మేశ్వర' స్వామిని నేను శరణు వేడుకుంటున్నాను.
పూజా ఫలితం :-
సంతానం లేని దంపతులు ఈ క్షేత్రాన్ని దర్శించి, ఘుశ్మేశ్వరుడిని భక్తితో పూజిస్తే సుగుణాలైన సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.ఈ స్వామిని స్మరించడం వల్ల కుటుంబంలో ఉన్న అసూయలు, గొడవలు తొలగిపోయి, అందరి మధ్య ప్రేమ, సంతోషాలు వెల్లివిరుస్తాయి.