శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి

Pineapple

ఉగ్రరూపంలో ఉన్న నరసింహుడిని లక్ష్మీదేవి తన శాంతస్వరూపంతో ప్రసన్నం చేసుకున్న పరమపావనమైన రూపం. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం మహావిష్ణువు ధరించిన నాల్గవ అవతారం ఇది.

పురాణాల ప్రకారం, హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు బ్రహ్మదేవుని నుండి ఒక వింత వరం పొందాడు. దాని ప్రకారం అతనికి చావు అనేది మనుషులు లేదా జంతువుల వల్ల కాకుండా, పగలు లేదా రాత్రి కాకుండా, ఇంటి లోపల లేదా బయట కాకుండా, భూమిపై లేదా ఆకాశంలో కాకుండా, ఎటువంటి ఆయుధాల వల్ల కూడా సంభవించకూడదు. ఈ అహంకారంతో అతడు లోకాలను హింసిస్తూ, తన కుమారుడైన పరమ విష్ణుభక్తుడు ప్రహ్లాదుడిని కూడా చంపడానికి ప్రయత్నించాడు."నీ హరి అంతటా ఉంటే ఈ స్తంభంలో ఉన్నాడా?" అని హిరణ్యకశిపుడు అడగ్గా, ప్రహ్లాదుడు "ఉన్నాడు" అని సమాధానమిచ్చాడు. ఆ క్షణంలో హిరణ్యకశిపుడు స్తంభాన్ని పగలగొట్టగా, మహావిష్ణువు నరసింహ అవతారంలో భయంకరమైన ఉగ్రరూపంతో ఆవిర్భవించాడు. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రత్వం తగ్గలేదు. ఆయన కోపోద్రిక్త రూపానికి ముల్లోకాలు వణికిపోయాయి. దేవతలు, ప్రహ్లాదుడు ప్రార్థించినా స్వామి శాంతించలేదు. అప్పుడు దేవతల కోరిక మేరకు లక్ష్మీదేవి అక్కడ ప్రత్యక్షమై, స్వామివారి తొడపై కూర్చుంది. జగన్మాత లక్ష్మీదేవి స్పర్శతో నరసింహస్వామి ఉగ్రరూపం వీడి, అత్యంత దయామయుడైన "శ్రీ లక్ష్మీ నరసింహస్వామి" గా శాంతస్వరూపాన్ని దాల్చాడు. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి.

శ్లోకం : -

శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే | భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే ||

యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత |లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

భావం : -

క్షీరసాగరమే నివాసంగా కలిగినవాడు, చేతిలో చక్రాన్ని ధరించినవాడు, శేషపాన్పుపై శయనించి ప్రకాశించే పుణ్యమూర్తి, యోగులకు ప్రభువు, సంసారమనే సముద్రాన్ని దాటించే నావ వంటివాడైన ఓ లక్ష్మీ నరసింహస్వామి! నాకు నీ హస్తాన్ని ఆసరాగా (కరావలంబంగా) ఇచ్చి నన్ను రక్షించు.

పూజా ఫలితం : -

"నరసింహ" నామస్మరణకు దుష్ట శక్తులు, భూత ప్రేత పిశాచ బాధలు, మానసిక భయాలు తక్షణమే పటాపంచలవుతాయి. లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుండి శీఘ్రంగా ఉపశమనం లభిస్తుంది. స్వామివారి అనుగ్రహం వల్ల శత్రువులపై విజయం లభిస్తుంది. కోర్టు గొడవలు, లీగల్ సమస్యలు అనుకూలంగా మారుతాయి.