శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
చాముండేశ్వరి
శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం (కర్ణాటకలోని మైసూరు) ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో నాల్గవ శక్తిపీఠం. చాముండీ కొండలపై కొలువై ఉన్న ఈ దేవిని మైసూరు సంస్థాన ప్రభువుల ఇలవేల్పుగా మరియు కర్ణాటక రాష్ట్ర రక్షక దేవతగా పూజిస్తారు.
దక్షయజ్ఞం తర్వాత సతీదేవి పవిత్ర శరీరాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు, అమ్మవారి "కురులు" (తల వెండ్రుకలు) పడిన పవిత్ర స్థలమిది. పురాణాల ప్రకారం, పూర్వం ఈ ప్రాంతాన్ని ఎద్దు ముఖం కలిగిన 'మహిషాసురుడు' అనే రాక్షసుడు పాలిస్తూ దేవతలను, మునులను హింసించేవాడు. దేవతల ప్రార్థన మేరకు పరాశక్తి పద్దెనిమిది చేతులతో ఉగ్రరూపం దాల్చి, ఈ కొండలపైనే మహిషాసురుడితో భీకరంగా పోరాడి అతడిని సంహరించింది. అందువల్లనే అమ్మవారికి 'మహిషాసురమర్దిని' అని, ఈ నగరానికి 'మైసూరు' (మహిషూరు) అని పేర్లు వచ్చాయి. దేవీ భాగవతం ప్రకారం, అమ్మవారు శుంభ-నిశుంభుల అనుచరులైన 'చండ-ముండ' అనే రాక్షసులను సైతం వధించింది. చండ-ముండులను సంహరించినందుకు గాను ఆమెకు 'చాముండా' లేదా 'చాముండేశ్వరి' అనే పేరు స్థిరపడింది. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..
శ్లోకం : -
"లంకాయాం శాంకరీ దేవీ, కామాక్షీ కాంచికాపురే |
ప్రద్యుమ్నే శృంఖలా దేవీ, చాముండీ క్రౌంచపట్టణే ||"
భావం : -
క్రౌంచపట్టణం (మైసూరు) లో 'శ్రీ చాముండేశ్వరి దేవి' గా వెలిసిన ఆ జగన్మాతకు నేను నమస్కరిస్తున్నాను.
పూజా ఫలితం : -
ఉగ్ర స్వరూపిణియైన చాముండేశ్వరి దేవిని స్మరించడం వల్ల దిష్టి దోషాలు, నరఘోష, చేతబడి మరియు శత్రువుల పీడలు తక్షణమే నశిస్తాయి. మనస్సులోని భయాలు, ఆందోళనలు తొలగిపోయి అపారమైన ఆత్మవిశ్వాసం, ధైర్యం కలుగుతాయి. చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది. పూర్వం రాజులు పూజించిన దేవి కాబట్టి, ఈమె ఆరాధన వల్ల సమాజంలో గౌరవం, ఉన్నత పదవులు లభిస్తాయని భక్తుల విశ్వాసం.