శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
శ్రీ సరస్వతీ దేవి
శ్రీ సరస్వతీ దేవి హిందూ ధర్మంలో చదువుల తల్లిగా, సమస్త విద్యలు, కళలు, బుద్ధి మరియు వాక్కుకు అధిష్ఠాన దేవతగా పూజలందుకుంటోంది. ఆమె సృష్టికర్తయైన బ్రహ్మదేవుని అర్ధాంగి (జ్ఞాన శక్తి).
పురాణాల ప్రకారం, బ్రహ్మదేవుడు సృష్టిని నిర్మించిన కొత్తలో అంతా నిశ్శబ్దంగా, ప్రాణం లేనట్లుగా ఉంది. సృష్టిలోని ఈ నిస్సారతను చూసి కలత చెందిన బ్రహ్మదేవుడు తన కమండలంలోని పవిత్ర జలాలను భూమిపై చల్లాడు. ఆ జలాల నుండి శ్వేతవస్త్రాలు ధరించి, ఒక చేతిలో వీణ, మరో చేతిలో వేదగ్రంథం మరియు రుద్రాక్ష మాలతో అత్యంత తేజోవంతమైన దేవి ఆవిర్భవించింది. ఆమె తన వీణను మీటగానే విశ్వమంతటా పవిత్రమైన నాదం (ఓంకారం) ధ్వనించింది. సృష్టిలోని జీవులన్నింటికీ వాక్కు, బుద్ధి మరియు చైతన్యం లభించాయి. బ్రహ్మదేవుని సృష్టికి ఊపిరి పోసి, జ్ఞానాన్ని అందించినందున ఆమె వాగ్దేవిగా, సరస్వతిగా ప్రసిద్ధి చెందింది. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి.
శ్లోకం : -
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||
భావం : -
కోరిన వరాలను ఇచ్చేదానివి, సుందర రూపం కలదానివి అయిన ఓ సరస్వతీ దేవి! నీకు నమస్కరిస్తున్నాను. నేను నా చదువును ప్రారంభిస్తున్నాను, ఇది నాకు ఎల్లప్పుడూ సంపూర్ణ విజయవంతం అయ్యేలా అనుగ్రహించు.
పూజా ఫలితం : -
నిత్యం లేదా వసంత పంచమి రోజున అమ్మవారిని ఆరాధించడం వల్ల అజ్ఞానమనే చీకటి తొలగిపోయి బుద్ధి చురుగ్గా మారుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. వాగ్దేవి అనుగ్రహం వల్ల మాట్లాడే తీరు మెరుగవుతుంది. సంగీతం, సాహిత్యం, మరియు ఇతర లలిత కళలలో నైపుణ్యం లభిస్తుంది.