శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
శ్రీ అయ్యప్పస్వామి
పూర్వం దుర్గాదేవి చేతిలో చనిపోయిన మహిషాసురుడికి 'మహిషి' అనే సోదరి ఉండేది. ఆమె అన్న మరణానికి పగ తీర్చుకోవడానికి బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేసింది. "హరి, హరుల సంయోగం వల్ల జన్మించిన, భూమిపై 12 ఏళ్లు మానవ రూపాన్ని గడిపిన బాలుడి చేతిలోనే నాకు మరణం సంభవించాలి" అనే వరాన్ని పొందింది. పురుషులైన శివకేశవులకు సంతానం కలగడం అసాధ్యం అనే అహంకారంతో ఆమె దేవతలను పీడించసాగింది. లోకకల్యాణం కోసం, క్షీరసాగర మథన సమయంలో విష్ణుమూర్తి ధరించిన మోహినీ రూపానికి, పరమశివుని తేజస్సుకు ఒక దివ్య బాలుడు జన్మించాడు. ఆ బాలుడే హరిహరసుతుడైన అయ్యప్ప. ఆ బాలుడిని పందళ దేశపు రాజైన రాజశేఖరుడు అడవిలో వేటకు వెళ్ళినప్పుడు కనుగొని మెడలో మణిహారం ఉండటం వల్ల 'మణికంఠుడు' అని పేరు పెట్టి, సంతానం లేని ఆ రాజు సొంత కొడుకులా పెంచుకున్నాడు. కొన్నేళ్లకు రాణికి ఒక సొంత కుమారుడు జన్మించాడు. దుష్ట మంత్రి కుతంత్రాల వల్ల, రాణి మణికంఠుడిని వదిలించుకోవాలని తనకు భయంకరమైన కడుపునొప్పి వచ్చినట్లు నటించి, "పులి పాలు" మాత్రమే ఔషధమని చెప్పడం వల్ల తల్లి కోరిక మేరకు 12 ఏళ్ల మణికంఠుడు అడవికి వెళ్ళాడు. అక్కడ దేవతలను వేధిస్తున్న మహిషిని సంహరించి, తన అవతార ప్రయోజనాన్ని నెరవేర్చాడు. అనంతరం దేవేంద్రుని పులి రూపంలో మార్చి, పులుల గుంపుతో కలిసి పందళ రాజ్యానికి తిరిగి వచ్చాడు. ఆ మహిమను చూసి రాజు, రాణి క్షమాపణలు వేడుకున్నారు. మణికంఠుడు వారికి జ్ఞానోపదేశం చేసి, తాను శబరిమల కొండల్లో యోగ ముద్రలో స్థిరపడతానని చెప్పి అంతర్దానమయ్యాడు. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి.
శ్లోకం : -
హరివరాసనం విశ్వమోహనం |హరిహరాత్మజం దేవమర్చితమ్ ||
శరణకీర్తనం శక్తమానసం |శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ||
భావం : -
హరి కి ఇష్టమైన పడక కలిగి, విశ్వాన్నంతటినీ మోహింపజేసే సుందర రూపం కలవాడు, శివకేశవుల పుత్రుడు మరియు దేవతల చేత పూజలందుకునేవాడు అయిన ఆ శ్రీ అయ్యప్ప స్వామిని నేను శరణు వేడుకుంటున్నాను.
పూజా ఫలితం : -
అయ్యప్ప స్వామిని స్మరిస్తూ 41 రోజుల పాటు కఠినమైన మండల దీక్ష చేయడం వల్ల మనుషులలోని కామ, క్రోధ, లోభాలు నశించి మానసిక నిగ్రహం కలుగుతుంది. శని దోషాలు, నవగ్రహ దోషాలతో బాధపడేవారు అయ్యప్ప దీక్షను తీసుకుని శబరిమల క్షేత్రాన్ని దర్శిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక్కడ కులమత భేదాలు లేవు. ప్రతి ఒక్కరూ ఒకరినొకరు 'స్వామి' అని పిలుచుకుంటారు, ఇది మనుషులలోని అహంకారాన్ని తొలగించి దైవత్వాన్ని పెంచుతుంది.