శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
బిరజా దేవి (గిరిజా దేవి)
శ్రీ బిరజా దేవి (గిరిజా దేవి) ఆలయం (ఒడిశాలోని జాజ్‌పూర్) ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో పదకొండవ శక్తిపీఠం. వైతరణీ నదీ తీరాన కొలువై ఉన్న ఈ క్షేత్రాన్ని 'నాభి గయ' అని లేదా 'బిరజా క్షేత్రం' అని పిలుస్తారు.
దక్షయజ్ఞం తర్వాత సతీదేవి పవిత్ర శరీరాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు, అమ్మవారి "నాభి భాగం" పడిన పవిత్ర స్థలమిది. పురాణాల ప్రకారం, పూర్వం బ్రహ్మదేవుడు వైతరణీ నదీ తీరాన ఒక గొప్ప యజ్ఞాన్ని చేసాడు. ఆ యజ్ఞ గుండం నుండి పరాశక్తి నిర్మలమైన, రాగద్వేషాలు లేని రూపంతో ఆవిర్భవించింది. 'రజోగుణం' (అహంకారం/కోపం) లేని ప్రశాంత రూపం కాబట్టి ఈమెకు 'బిరజా దేవి' (విగతః రజః యస్యాః సా - బిరజా) అని పేరు వచ్చింది. గయాసురుడనే రాక్షసుని శరీరంపై బ్రహ్మదేవుడు యజ్ఞం చేసినప్పుడు, అతని నాభి భాగం ఈ జాజ్‌పూర్‌లో ఉంది. అందువల్ల దీనిని 'నాభి గయ' అంటారు. ఇక్కడ పితృదేవతలకు పిండప్రదానం చేయడం అత్యంత పవిత్రమైన కార్యంగా భావిస్తారు. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..
శ్లోకం : -
"ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠికాపుర్యాం పురుహూతికా |
ఓఢ్యాయాం గిరిజాదేవీ, మాణిక్యా దక్షవాటికే ||"
భావం : -
ఒడిశా (ఓఢ్య దేశం) లో 'శ్రీ గిరిజా దేవి' (బిరజా మాత) గా వెలిసిన ఆ జగన్మాతకు నా ప్రణామములు.
పూజా ఫలితం : -
నాభి గయ తీర్థంలో స్నానం చేసి, బిరజా దేవిని దర్శించడం వల్ల పితృదేవతలకు నరక బాధల నుండి విముక్తి కలిగి, వంశస్థులకు ఆయురారోగ్యాలు, సంతాన ప్రాప్తి కలుగుతాయి. 'బిరజా' నామస్మరణ వల్ల మనసులోని కల్మషాలు, అజ్ఞానం తొలగిపోయి నిర్మలమైన బుద్ధి, మనశ్శాంతి లభిస్తాయి. ఆశ్వయుజ మాసంలో అమ్మవారికి జరిగే రథోత్సవాన్ని (నవరాత్రి ఉత్సవాలు) తిలకించడం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసము.