శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

సదా శివ మూర్తి మరియు చండికా ఆలయం

సదాశివుడు

సదాశివుడు :-

శివ పురాణంలోని రుద్ర సంహిత ప్రకారం , సదాశివుడు శివలోకం అనే దివ్యలోకాన్ని సృష్టించాడు. భౌతిక విశ్వాన్ని సృష్టించాలనే కోరికతో, ఆయన విశ్వమాత అయిన పరాశక్తిని (లేదా దుర్గాదేవిని) అవతరింపజేసాడు. వారిద్దరూ కలిసి ముగ్గురు ప్రధాన దేవతలకు జన్మనిచ్చారు. సృష్టించడానికి బ్రహ్మ, నిలబెట్టడానికి విష్ణువు, మరియు లయం చేయడానికి రుద్రుడు (శివుడు). ఈ సృష్టి చక్రానికి సదాశివుడు శాశ్వతమైన, మార్పులేని సాక్షిగా నిలిచి ఉన్నాడు. ఇన్ని యుగాలు గడిచినా కైలాశనాధుడు మొట్టమొదటి భూమి మీద ఆవిర్భవించినటువంటి రూపంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధముగా రూపాధ్యాయన గ్రంధాన్ని అనుసరించి 25 తలలతో, 50 చేతులతో, 48 ఆయుధములతో 2 అభయ హస్తములతో ఓం శివ శక్తి పీఠం నందు నిర్మించడం జరిగింది. అదేవిధంగా అత్యంత శక్తివంతమైన సకల దేవతా స్వరూపిణి అయినటువంటి జగన్మాతా మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతి, త్రిశక్తి అమ్మవార్ల యొక్క కలయికతో ఆవిర్భవించినటువంటి మహాశక్తి శాలిని చండికా దేవి అమ్మవారిని రూపాధ్యాయన గ్రంధాన్ని అనుసరించి ఆలయం నిర్మించడమైనది.

ఈ 25 తలలు కేవలం రూపానికి సంబంధించినవి కావు, ఇవి విశ్వసృష్టి, తత్వాలు మరియు శివుని ఐదు ప్రధాన ముఖాల (పంచబ్రహ్మల) యొక్క విస్తరణకు సంకేతాలు. 25 తలలులో 9 తలలు వరుసక్రమం మానవాళి జీవన స్థితిగతులను నిర్ణయించే నవగ్రహాలకు ప్రతీక్, 7 తలలు వరుసక్రమం జ్ఞానాన్ని ప్రసాదించే సప్తఋషులకు ప్రతీక, 5 తలలు వరుసక్రమం ప్రత్యక్ష దైవాలై సృష్టిని నడిపించే పంచభూతాలకు ప్రతీక, 3 తలలు వరుసక్రమం సృష్టి, స్తితి, లయలకు కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ప్రతీక. పైన ఉదాహరించిన అన్ని రూపాలు మొదటి శిరస్సు నందు ఇమిదీకృతమై సదాశివమూర్తి గా సమస్త బ్రహ్మాండం తన ఆధీనంలో ఉందని స్వామివారు దర్సనమిస్తారు. అక్కడి ఆలయ నమూనాలు, మూలవిరాఠ్ నమూనాలను అనుసరించి “ఓం శివశక్తి పీఠం – శంబాల నగరం” నందు ప్రతిష్టించడం జరిగింది.

శ్లోకం :-

"పంచవింశతి వక్త్రం చ పంచాశత్ బాహుభిర్యుతమ్ |

మహాసదాశివం ధ్యాయేత్ సర్వాభరణ భూషితమ్ ||"

భావం :-

25 ముఖములు (తలలు) మరియు 50 చేతులు కలిగి, సకల దివ్యాభరణాలతో ప్రకాశిస్తున్న ఆ మహాసదాశివుడిని నేను హృదయంలో ధ్యానిస్తున్నాను.

సదాశివుడు

చండికా దేవి :-

హిందూ పురాణాల ప్రకారం సదాశివుని భార్య అయిన చండికా దేవి అత్యంత శక్తివంతమైన, ఉగ్రమైన మరియు కరుణామయమైన రూపం, మార్కండేయ పురాణంలోని 'చండీ సప్తశతి' లోని 700 శ్లోకాల ద్వారా అమ్మవారి మహిమలు వర్ణించబడ్డాయి. సృష్టిలో రాక్షసుల బాధలు ఎక్కువైనప్పుడు, దేవతల ప్రార్ధన మేరకు పరమశివుని ఆదేశంతో సమస్త దేవతల తేజస్సు ఒకచోట చేరి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలుగా ఉద్భవించిన త్రిశక్తుల సమ్మేళనమే చండికాదేవి. కాబట్టి మన కార్య సాధనలో అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించుటకు మహాలక్ష్మి అమ్మవారు గానూ, యుక్తిని, శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించుటకు కాళికా అమ్మవారు గాను, పరిపూర్ణమైన జ్ఞానం అందించడానికి మహాసరస్వతి అమ్మవారు గాను ముగ్గురు అమ్మవార్ల ప్రతిరూపంగా చండికా దేవిని మనం ప్రతిష్ఠిస్తున్నాము. కలియుగంలో చండీసప్తశతి పటించినా, చండీ హోమం చేసినా, ఉత్తర క్షణంలో భక్తుల కోరికలు నెరవేరతాయని పురాణాలు చెబుతున్నాయి. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు చండికా దేవి అమ్మవారిని శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ అమ్మవారిని దర్శించండి తరించండి.

శ్లోకం :-

యా దేవీ ఖడ్గహస్తా సకలజనపదవ్యాపినీ విశ్వదుర్గా శ్యామాంగీ శుక్లపాశా ద్విజగణగణితా బ్రహ్మదేహార్ధవాసా |

జ్ఞానానాం సాధయిత్రీ యతిగిరిగమనజ్ఞాన దివ్య ప్రబోధాసా దేవీ దివ్యమూర్తిః ప్రదహతు దురితం చండముండా ప్రచండా ||"

భావం :-

చేతిలో ఖడ్గము, శ్యామల వర్ణము, తెల్లని పాశము ధరించి, బ్రహ్మదేవుని అర్ధ భాగమునందుండునది, జ్ఞాన ప్రబోధమును ఇచ్చునది అగు దివ్య మంగళ స్వరూపిణి, చండముండులను సంహరించిన ప్రచండ చండికా దేవి నా సమస్త పాపాలను, కష్టాలను దహించివేయుగాక.