శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

కోదండ రామాలయం

Pineapple

శ్రీ రామచంద్రుడు హిందూ ధర్మంలో "మర్యాద పురుషోత్తముడిగా” పూజలందుకుంటున్న మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం. ఆయన జీవితం మానవాళికి ధర్మబద్ధంగా ఎలా జీవించాలో నేర్పిన ఒక గొప్ప మార్గదర్శి.

త్రేతాయుగంలో లంకాధిపతియైన రావణాసురుడు బ్రహ్మదేవుని నుండి ఒక వింత వరం పొందాడు. దాని ప్రకారం అతనికి దేవతలు, గంధర్వులు, యక్షులు లేదా రాక్షసుల వల్ల మరణం సంభవించదు. మానవులను తృణీకారంగా భావించిన రావణుడు వారిని వరంలో చేర్చలేదు. అందువల్ల, రావణ సంహారం కోసం మహావిష్ణువు మానవ రూపంలో జన్మించడానికి నిశ్చయించుకున్నాడు. అయోధ్యా నగర రాజు, రఘువంశీయుడైన దశరథ మహారాజుకు పుత్రసంతానం లేకపోవడంతో ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో "పుత్రకామేష్ఠి యాగం" జరిపించారు. యజ్ఞకుండం నుండి వ్యక్తమైన ప్రాజాపత్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన ముగ్గురు భార్యలకు పంచాడు. చైత్ర శుద్ధ నవమి నాడు (శ్రీరామనవమి) పునర్వసు నక్షత్రంలో కౌసల్యా దేవి గర్భాన శ్రీరాముడు జన్మించాడు. కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శతృఘ్నులు జన్మించారు. రామునికి 'రామచంద్రుడు' అనే పేరు రావడానికి పురాణాల ప్రకారం బాల్యంలో శ్రీరాముడు ఆకాశంలోని చంద్రుడిని చూసి, ఆ చంద్రుడు తనకు ఆడుకోవడానికి కావాలని పట్టుబట్టాడు. అప్పుడు తల్లి కౌసల్య ఒక పాత్రలో నీరు పోసి, అందులో చంద్రుని ప్రతిబింబాన్ని చూపించి రాముడిని శాంతింపజేసింది. చంద్రుని వంటి ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన ముఖవర్చస్సు కలిగినవాడు కావడం వల్ల ఆయన్ను రామచంద్రుడు అని పిలుస్తారు. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి.

రామ తారక మంత్రం : -

ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్.

భావం : -

ఆపదలను పోగొట్టువాడు, అన్ని సంపదలను ఇచ్చువాడు, లోకములో అతి సుందరమైన వాడైనట్టి శ్రీ రామచంద్రునికి మాటి మాటికి నమస్కరిస్తున్నాను

పూజా ఫలితం : -

"రామ" అనే రెండక్షరాల మంత్రంలో 'రా' అనగా విష్ణుమూర్తి (శక్తి), 'మ' అనగా శివుడు (జీవుడు). ఈ నామాన్ని నిత్యం స్మరించడం వల్ల మనసులోని చంచలత్వం తొలగిపోయి అపారమైన ప్రశాంతత లభిస్తుంది. వనవాస కష్టాలను చిరునవ్వుతో జయించిన స్వామి కాబట్టి, రామాయణం చదవడం లేదా రామనామ జపం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా తట్టుకునే ధైర్యం, విముక్తి లభిస్తాయి. ఆదర్శ కొడుకుగా, ఆదర్శ అన్నగా, ఆదర్శ భర్తగా మరియు ఆదర్శ రాజుగా రాముని జీవితాన్ని స్మరించడం వల్ల కుటుంబంలో సత్సంబంధాలు, శాంతి నెలకొంటాయి.