శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

శ్రీ ప్రత్యంగిరా దేవి

Pineapple

శ్రీ ప్రత్యంగిరా దేవి:-

శ్రీ ప్రత్యంగిరా దేవి (శ్రీ మహా ప్రత్యంగిరా దేవి) హిందూ సంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన, ఉగ్ర రూపం కలిగిన దేవత. శత్రు వినాశనానికి, నరదృష్టి, చేతబడి వంటి నకారాత్మక శక్తుల నివారణకు ఈమెను పూజిస్తారు. సింహ ముఖం, స్త్రీ శరీరంతో దర్శనమిచ్చే ఈ తల్లిని "అథర్వణ భద్రకాళి" అని కూడా పిలుస్తారు.

పురాణాల ప్రకారం ప్రత్యంగిరా దేవి ఆవిర్భావం శ్రీమహావిష్ణువు హిరణ్యకశిపుణ్ణి వధించడానికి నరసింహ అవతారాన్ని ఎత్తాడు. రాక్షస వధ తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రత చల్లారలేదు. ఆయన క్రోధాగ్నికి లోకాలు నశించిపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు దేవతలందరూ శివుడిని ప్రార్థించగా, పరమశివుడు నరసింహస్వామిని శాంతింపజేయడానికి సగం పక్షి, సగం సింహం రూపంలో ఉండే అత్యంత శక్తివంతమైన "శరభేశ్వరుడు" అవతారాన్ని ధరించాడు. శరభేశ్వరుడు నరసింహస్వామిని తన పంజాతో బంధించడానికి ప్రయత్నించినప్పుడు, నరసింహస్వామి శరీరం నుండి "గండభేరుండ" అనే పక్షి రూప ఉగ్ర శక్తి ఉద్భవించింది. ఈ రెండు మహా శక్తుల (శరభ, గండభేరుండ) యుద్ధం వల్ల సృష్టి అంతం అయ్యే ప్రమాదం ఏర్పడింది. ఆ సమయంలో పరమశివుని మూడో కన్ను నుండి అత్యంత భయంకరమైన, శక్తివంతమైన డింగర, అంగర అనే ఇద్దరు మహర్షుల మంత్ర శక్తి ద్వారా ప్రత్యంగిరా దేవి ఆవిర్భవించింది. వెయ్యి సింహాల గర్జనతో, నీల మేఘ చాయతో ఆవిర్భవించిన ఈమె, శరభేశ్వరుడి రెక్కల వెనుక శక్తిగా నిలిచి నరసింహస్వామిని, గండభేరుండాన్ని శాంతింపజేసింది. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..

శ్లోకం :-

"ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యాంగిరే మాం రక్ష రక్ష |
మమ శత్రూన్ నాశయ నాశయ ఓం ఫట్ స్వాహా ॥"

భావం :-

"ఐం, హ్రీం, శ్రీం అనే బీజాక్షర స్వరూపిణి అయిన ఓ శ్రీ ప్రత్యంగిరా దేవి! నన్ను (నా కుటుంబాన్ని) అన్ని వేళలా రక్షించు. నాలో ఉండే అరిషడ్వర్గాలు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) అనే అంతర్గత శత్రువులను, బయట ఉండే బాహ్య శత్రువులను, నకారాత్మక శక్తులను నాశనం చేయి తల్లి."

పూజా ఫలితాలు :-

శత్రు వినాశనం & విజయ ప్రాప్తి, నరదృష్టి, నకారాత్మక శక్తుల నివారణ, భయ నివారణ & మానసిక ధైర్యం, గ్రహ దోష నివారణ (ముఖ్యంగా రాహు-కేతు, శని దోషాలు) , ఆరోగ్య సిద్ధి & ప్రాణ రక్షణ, ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి.