శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

శారదా పీఠం

సోమనాథ జ్యోతిర్లింగం

శ్రీ శారదా పీఠం (సరస్వతీ దేవి శక్తిపీఠం) ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో ఆఖరిదైన పద్దెనిమిదవ శక్తిపీఠం. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని నీలం లోయలో కిషన్‌గంగ (నీలం) నదీ తీరాన, నియంత్రణ రేఖకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఈ చారిత్రక క్షేత్రం శిథిలావస్థలో ఉంది.

దక్షయజ్ఞం తర్వాత సతీదేవి పవిత్ర శరీరాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు, అమ్మవారి "కుడి చేతి భాగం" పడిన పరమ పవిత్రమైన స్థలమిది. ఒకప్పుడు ఈ క్షేత్రం కేవలం ఆలయం మాత్రమే కాదు, నలంద, తక్షశిలల తరహాలోనే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన "శారదా పీఠ విశ్వవిద్యాలయం". ఇక్కడి గ్రంథాలయం అత్యంత ప్రాచుర్యం పొందింది. దేశదేశాల నుండి పండితులు ఇక్కడికి వచ్చి శాస్త్ర చర్చలు చేసేవారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు భారతదేశం నలుమూలలా ఉన్న పండితులను జ్ఞానసమరంలో గెలిచి, ఇక్కడి శారదా సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. శంకరాచార్యులు ప్రతిష్టించిన శారదా పీఠాలన్నింటికీ (ముఖ్యంగా శృంగేరి పీఠానికి) ఈ క్షేత్రమే మూలస్తంభం. ఉత్తర భారతదేశంలో శతాబ్దాల పాటు వర్ధిల్లిన 'శారదా లిపి' (కశ్మీరీ భాషా లిపి) ఈ పీఠం పేరు మీదుగానే ఆవిర్భవించింది. దీనివల్ల కశ్మీర దేశానికి "శారదా దేశం" అనే పేరు వచ్చింది. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి.

శ్లోకం : -

"నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని

త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే"

భావం : -

పవిత్ర కశ్మీర దేశంలో నివసించే ఓ శారదా దేవి! నీకు నా నమస్కారములు. నాకు నిరంతరం సద్బుద్ధిని, విద్యాదానాన్ని ప్రసాదించవలసిందిగా నిన్ను ప్రార్థిస్తున్నాను.

పూజా ఫలితం : -

విద్యా దేవతయైన శారదా దేవిని స్మరించడం వల్ల అజ్ఞానం నశించి, అపారమైన మేధస్సు, ఏకాగ్రత మరియు ఉన్నతమైన విద్య లభిస్తాయి. అష్టాదశ శక్తిపీఠాల ముగింపు పీఠమైన ఈ శారదా సర్వజ్ఞ పీఠాన్ని మనసులో తలచుకున్నా, లేదా తీత్వాల్ క్షేత్రాన్ని దర్శించినా బుద్ధి వికాసం కలిగి, అంత్యకాలంలో మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.