శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
రేణుకా దేవి (ఏకవీరికా)
శ్రీ రేణుకా దేవి ఆలయం (మహారాష్ట్రలోని మాహూర్) ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో ఎనిమిదవ శక్తిపీఠం. దట్టమైన అడవులు, కొండల మధ్య కొలువై ఉన్న ఈ క్షేత్రాన్ని పరశురాముని జన్మభూమిగా మరియు దత్తాత్రేయుని విశ్రాంతి స్థానంగా పురాణాలు కీర్తిస్తున్నాయి.
దక్షయజ్ఞం తర్వాత సతీదేవి పవిత్ర శరీరాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు, అమ్మవారి "కుడి చేతి భాగం" పడిన పవిత్ర స్థలమిది. పురాణాల ప్రకారం, ఈమె జమదగ్ని మహర్షి భార్య మరియు విష్ణు అవతారమైన పరశురాముని తల్లి. ఒకసారి మానసిక చలనం వల్ల రేణుకా దేవి నీటిని తెచ్చే శక్తిని కోల్పోవడంతో, తండ్రి ఆజ్ఞ మేరకు పరశురాముడు తన తల్లి తల నరికివేశాడు. ఆ తర్వాత తండ్రి ఇచ్చిన వరంతో తిరిగి తల్లిని బతికించుకున్నాడు. కాలక్రమేణా జమదగ్ని మహర్షి కార్తవీర్యార్జునుని కొడుకుల చేతిలో మరణించగా, రేణుకా దేవి ఆయనతో పాటు సతీసహగమనం చేసింది. ఆ సమయంలో ఆమె శరీరం నుండి వెలువడిన దివ్యశక్తి ఈ మాహూర్ కొండలపై 'ఏకవీరికా దేవి' గా ఆవిర్భవించింది. తల్లి మరణానంతరం దుఃఖంలో ఉన్న పరశురామునికి రేణుకా దేవి ఆకాశవాణి రూపంలో కనిపించి, ఈ కొండపై తల మాత్రమే ఉన్న రూపంలో (శిరస్సు రూపంలో) దర్శనమిచ్చింది. పరశురాముడు స్వయంగా ఆ రూపాన్ని ఇక్కడ ప్రతిష్టించి పూజలు చేశాడు. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..
శ్లోకం : -
"అలంపురే జోగులాంబా, శ్రీశైలే మల్లికార్జునీ |
కోల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా ||"
భావం : -
మాహూర్ (మాహుర్యం) క్షేత్రంలో 'శ్రీ ఏకవీరికా దేవి' (రేణుకా మాత) గా వెలిసిన ఆ జగన్మాతకు నా ప్రణామములు.
పూజా ఫలితం : -
రేణుకా దేవి మాతృత్వానికి ప్రతీక. ఈమెను పూజించడం వల్ల కుటుంబంలో ఉన్న గొడవలు తొలగిపోతాయి. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఉన్న విభేదాలు నశించి సఖ్యత పెరుగుతుంది. పరశురాముడికే అండగా నిలిచిన తల్లి కాబట్టి, ఈమెను స్మరిస్తే ఎంతటి ఆపదనైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం, శక్తి లభిస్తాయి. ముఖ్యంగా నవరాత్రులలో అమ్మవారికి జరిపించే ప్రత్యేక పూజల వల్ల తలపెట్టిన కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి.