శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
శ్రీ మాతంగి దేవి
శ్రీ మాతంగి దేవి:-
దశమహావిద్యలలో తొమ్మిదవ విద్యగా శ్రీ మాతంగి దేవి పూజలందుకుంటుంది. ఈమెను లలితా దేవి యొక్క మంత్రిణిగా భావిస్తారు. ఈమెను 'రాజమాతంగి', 'శ్యామలా దేవి' అని కూడా పిలుస్తారు. ఈమె మరకత మణి వర్ణంతో, మనోహరమైన రూపంతో, త్రినేత్రురాలిగా దర్శనమిస్తుంది. నాలుగు చేతులలో ఖడ్గం, పాశం, బల్లెం, అంకుశం ధరించి ఉంటుంది. సంగీతం, సాహిత్యం, లలిత కళలు, వాగ్దాటి మరియు సమస్త జ్ఞానానికి ఈమె అధినాయిక. ఈమెను ఆరాధించడం వల్ల 'వాక్సిద్ధి', శత్రు విజయం, మరియు ఆకర్షణ శక్తి లభిస్తాయి.శ్రీ మాతంగీదేవి ఉపాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి. సూర్యగ్రహానికి అధిదేవత మాతంగీదేవి అమ్మవారు. మాతంగీ స్తోత్రాన్ని కాని, హృదయాన్ని కాని, కవచాన్ని కాని ప్రతిరోజూ పఠించటం వల్ల రవిగ్రహ దోషాలు, పీడలు నివారించబడతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తర ఆషాడ నక్షత్రం వారు ఈ అమ్మవారిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..
శ్లోకం :-
అంబ శశిబింబవదనే కంబుగ్రీవే కఠోరకుచకుంభే
అంబరసమానమధ్యే శంబరరిపువైరిదేవి మాం పాహి
కుందముకులాగ్రదంతాం కుంకుమపంకేన లిప్తకుచభారామ్
ఆనీలనీలదేహామంబామఖిలాండనాయకీం వందే
భావం :-
చంద్రుని వంటి చల్లని ముఖము, శంఖము వంటి మెడ, సన్నని నడుము కలిగి... కుంకుమ అలంకారాలతో, మొల్లమొగ్గల్లాంటి చిరునవ్వుతో, నల్లటి దివ్య మంగళ స్వరూపంతో ప్రకాశించే ఓ అఖిలాండేశ్వరి! మన్మథుడిని జయించిన ఆ పరమశివుని అంతరంగ ప్రియురాలవైన ఓ అమ్మా, నీకు వందనం. నన్ను నీ చల్లని చూపులతో రక్షించు తల్లి!" అని భక్తుడు ఈ శ్లోకం ద్వారా ప్రార్థిస్తున్నాడు.