శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
శ్రీ బగలాముఖి దేవి
శ్రీ బగలాముఖి దేవి:-
దశమహావిద్యలలో ఎనిమిదవ దేవత శ్రీ బగలాముఖి దేవి. శత్రువుల బలమును, వాక్కును స్తంభింపజేయడంలో ఈ దేవి అత్యంత శక్తివంతమైనదిగా భక్తులు నమ్ముతారు. పసుపు రంగు వస్త్రాలు, ఆభరణాలు ధరించి, బంగారు వర్ణంలో దర్శనమిస్తుంది. ఈమె శత్రువుల నాలుకను లాగి, గదతో కొడుతున్నట్లుగా వర్ణించబడింది. అంతర్గత మరియు బాహ్య శత్రువుల నుండి రక్షిస్తుంది. ప్రతికూల శక్తులను, చెడు ఆలోచనలను నాశనం చేస్తుంది. బగళాముఖిదేవి ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది. కుజుడికి అధిదేవత బగళాముఖీదేవి అమ్మవారు. ఈ తల్లి అనుగ్రహం కలిగితే కుజగ్రహ బాధనుండి విముక్తి లభిస్తుంది. అద్భుతాలు, సాహసకృత్యాలు చేసేవారు, మిలటరీ, పోలీసు, రెవిన్యూ, శాఖల్లో పనిచేసేవారు, భూసంబంధ, కోర్టు సంబంధ, బలవత్తర శత్రుసంబంధ వ్యవహారాలవారికి, క్రూరమృగాలను, ఉగ్రవాదుల్ని, ముఠా నాయకుల్ని లొంగదీసే వారికి ఈ శక్తిని ఆరాధించటంవల్ల ఫలితం వుంటుంది. కుజగ్రహ దోషం వల్ల బాధలు పడుతున్నవారు శ్రీ బగళాముఖి దేవిని యంత్ర, మంత్ర, తంత్ర ప్రక్రియల ద్వారా ఆరాధించటం వల్ల గొప్ప ఫలితం లభిస్తుంది. మృగశిర, చిత్ర, ధనిష్ట నక్షత్రం వారు ఈ అమ్మవారిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..
శ్లోకం :-
"మధ్యేసుధాబ్ధి మణిమంటప... స్మరామి బగళాముఖీం విముఖవాఙ్మనస్స్తంభినీమ్
పీయూషో దధిమధ్యచారు... ఇత్థం ధ్యాయతి యాంతి తస్య విలయం సద్యోథ సర్వాపదః
భావం :-
అమృత సముద్రం (సుధాబ్ధి) మధ్యలో ఉన్న మణిమండపంలోని ఒక దివ్యమైన రత్న వేదికపై, ఒక ఉన్నతమైన సింహాసనంపై కూర్చుని, పసుపు బంగారు వన్నెతో కూడిన దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నది, పసుపు రంగు వస్త్రాలను (పీతాంబర), పసుపు రంగు బంగారు ఆభరణాలను మరియు పసుపు పుష్పాల మాలలను తన శరీరంపై ధరించి అలంకృతురాలై ఉన్నది, తన ఒక చేతితో శత్రువు (వైరి) యొక్క నాలుకను పట్టుకుని, మరొక చేతితో గదను (ముద్గర) ధరించి ఉన్న అటువంటి మహాశక్తి స్వరూపిణి అయిన బగలాముఖి దేవిని నేను మనస్ఫూరిగా స్మరిస్తున్నాను (ధ్యానం చేస్తున్నాను).